చందమామపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని.. తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్లు తెలిపారు.
1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లు దిగిన సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గుహ ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. నాసా ప్రయోగించిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్(LRO) అందించిన రాడార్ కొలతలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూసిన శాస్త్రవేత్తలు.. ఆ ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు పదుల మీటర్లలో ఉండొచ్చని అంచనా వేశారు. ఇలాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా అక్కరకొస్తాయని .. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర రేడియో ధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.