ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ Hot Star తన ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసింది. గతేడాది ఏప్రిల్ లో రూ.399 వీఐపీ ప్లాన్, రూ.1499 ప్రీమియం ప్లాన్‌లను ప్రవేశపెట్టారు. అయితే తాజాగా కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఇకపై హాట్‌స్టార్ యాప్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్ తరహా ప్లాన్లను అమలు చేయనున్నారు.
హాట్‌స్టార్‌లో ఇకపై రూ.399 వీఐపీ ప్లాన్ ఉండదు. కొత్తగా రూ.499 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే రూ.299 నెలవారీ ప్రీమియం ప్లాన్‌ను కూడా తొలగించారు. రూ.499 ప్లాన్‌లో యాడ్స్ వస్తాయి. హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను చూడవచ్చు. కేవలం ఒక మొబైల్ డివైస్‌లో మాత్రమే ఈ ప్లాన్ పనిచేస్తుంది.
రూ.899 పేరిట ఇంకో ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీంట్లో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో వీడియోలను చూడవచ్చు. ఏకకాలంలో రెండు డివైస్‌లలో ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక రూ.1499 ప్లాన్ అలాగే ఉంది. ఈ ప్లాన్‌తో ఏకంగా 4 డివైస్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయవచ్చు.
ఇప్పటికే హాట్ స్టార్ వీఐపీ ప్లాన్‌ను వాడుతున్న వారు కొత్త మొబైల్ ప్లాన్ కు మైగ్రేట్ అవుతారని హాట్ స్టార్ తెలియజేసింది. నెట్‌ఫ్లిక్స్ లోనూ సరిగ్గా ఇలాంటి ప్లాన్లనే అమలు చేస్తున్నారు. దీని వల్ల ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకే అకౌంట్ ద్వారా ఎక్కువ మంది వీడియోలను చూసే సదుపాయానికి చెక్ పెట్టినట్లు అవుతుంది.