సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ ఇటీవలే ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పటి నుంచి, ఎలా విక్రయించేది.. ఆపిల్ వెల్లడించలేదు. కానీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అతి త్వరలోనే తమ ప్లాట్‌ఫాంపై ఆ ఐఫోన్లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో ఐఫోన్ ఎస్ఈ 2020 త్వరలో వస్తుందంటూ.. ఓ బ్యానర్‌ను ఉంచింది.
కాగా ఈ ఫోన్‌కు గాను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న ఐఫోన్ ప్రియులు రిజిస్టర్ చేసుకుంటే.. ఫోన్ అందుబాటులోకి రాగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.42,500 గా ఉంది. అయితే దేశంలో కరోనా ఆంక్షలను సడలించిన నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని యూజర్లకు మాత్రమే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది.
ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్‌లో.. 4.7 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ13 ప్రాసెసర్, 12, 7 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, టచ్ ఐడీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ వేరియెంట్ ధర రూ.42,500 ఉండగా, 128జీబీ వేరియెంట్ ధర రూ.47,800 ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.58,300గా ఉంది.