వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. అది వాడిని మానవుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు కదా.! ఫార్మల్, ఇన్‌ఫార్మల్ అన్ని విధాల కమ్యునికేషన్‌కు వాట్సప్ కీలకం. ఎప్పుడో మెయిల్ చేస్తారు. దాదాపు ఆఫీస్ డిస్కషన్స్ అన్నీ వాట్సప్‌లోనే అవుతున్నాయి. పొద్దున లేవడంతో ముందు వాట్సప్ ఆన్ చేసి చూసుకోవడం చాలా మందికి అలవాటు. అంత ముఖ్యం అయిపోయింది వాట్సప్ మన జీవితంలో. అయితే ఒక ఫోన్‌లో ఒకే వాట్సప్ ఉంటుంది. డ్యూయల్ యాప్ వేసుకుంటే ఇంకో వాట్సప్ వస్తుంది కదా..! కానీ ఇప్పుడు వాట్సప్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఒకటికి మించి వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించనుంది.
జీమెయిల్‌లో, ఇన్‌స్టాలో మనం ఒకటికి మించిన అకౌంట్లను ఒకే యాప్‌లో నిర్వహించుకోవచ్చు. కానీ వాట్సాప్‌లో అలా కుదరదు. సాధారణంగా ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్లను ఒకే ఫోన్‌లో నిర్వహించుకోవడం కుదరదు. వాట్సాప్ అందుకు అంగీకరించదు. మరో వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించాలంటే, డ్యూయల్ యాప్ వేసుకోవడమో లేదా మరో ఫోన్‌లోనే చేస్తుంటాం. ఇకపై, అలాంటి అవసరం ఉండబోదు. ఒకే ఫోన్‌లో, ఒకే వాట్సాప్ యాప్‌లో మీరు ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు. ఈ దిశగా కొత్త అప్ డేట్‌ను వాట్సాప్ తీసుకువస్తోంది. ప్రస్తుతానికి ఈ అప్ డేట్ కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఎలా ఓపెన్ చేయాలంటే..
ఈ అప్ డేట్ మీకు అందుబాటులోకి వచ్చిన తరువాత.. మల్టీ అకౌంట్ సదుపాయాన్ని మీ ఫోన్‌లో యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇందుకు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి, అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ (QR code) బటన్ పక్కన ఉన్న బాణం (arrow) గుర్తుపై క్లిక్ చేయాలి. అక్కడ మీ వేరే వాట్సాప్ అకౌంట్‌ను యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత, మీరు ఈ రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను ఒకే యాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే, ఆ అకౌంట్ నుంచి లాగౌట్ కావచ్చు. లేదా అకౌంట్‌ను డిలీట్ చేయవచ్చు. యూజర్లకు ఈ సరికొత్త ఫీచర్ ఎంతో ఉపయోగపడ్తుందని వాట్సాప్ భావిస్తోంది. దీనివల్ల, వేర్వేరు అవసరాలకు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను వాడే వారికి, అందుకోసం ప్రత్యేకంగా వేరే ఫోన్‌ను క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. వాట్సప్ ఇప్పటి వరకూ తెచ్చిన ఫీచర్లలో ఇది కూడా ఒక ముఖ్యమైన, ఉపయోగకరమైన ఫీచర్ అనే చెప్పాలి.