ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోనీ గతంలో వయావో ల్యాప్‌టాప్‌లను అందించిన విషయం విదితమే. అయితే 2014 నుంచి ఆ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి రావడం లేదు. కేవలం ఫోన్ల తయారీపైనే దృష్టి పెట్టామని, ఆ ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తిని నిలిపివేశామని సోనీ అప్పట్లో ప్రకటించించింది. అయితే త్వరలో మళ్లీ వయావో ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లో సందడి చేయనున్నాయి.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే వయావో ల్యాప్‌టాప్‌లు వస్తున్నాయని చెప్పి టీజర్‌ను వదిలారు. చాలా లైట్ వెయిట్ ఉన్న ల్యాప్‌టాప్‌లను త్వరలో విడుదల చేస్తామని అందులో ఇచ్చారు. దీంతో వయావో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అప్పట్లో ఈ ల్యాప్‌టాప్‌లకు మంచి డిమాండ్ ఉండేది. ప్రీమియం ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తుందని సోనీకి అప్పట్లో పేరుండేది. చాలా మంది ఉద్యోగులు, బిజినెస్ ప్రొఫెషనల్స్ సోనీ వయావో ల్యాప్ టాప్‌లను అప్పట్లో ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి వస్తుండడం వారిని ఆనందానికి గురి చేస్తోంది.
కాగా వయావో ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసి అమ్మేందుకు గాను సోనీ సంస్థ హాంగ్‌కాంగ్‌కు చెందిన నెక్స్‌గో అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా వయావో ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసి విక్రయిస్తాయి. అయితే టీజర్‌లో లైటర్ దాన్ యువర్ పాస్ట్ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. అందువల్ల అల్ట్రా ప్రీమియం ల్యాప్‌టాప్‌లను సోనీ విడుదల చేస్తుందని తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో సోనీ వయావో ల్యాప్‌టాప్‌లు ఇతర కంపెనీలకు ఎలాంటి పోటీని ఇస్తాయో వేచి చూస్తే తెలుస్తుంది.