సాధారణంగా ఎవరైనా మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు చనిపోతే వారి జ్ఞాపకాలన్నీ మనతో ఉండిపోతాయి. వారు మన దగ్గర లేరు అన్న విషయం తప్ప వారు పదే పదే మనకు గుర్తుకు వస్తుంటారు. దీంతో బాధ కలుగుతుంటుంది. వారు ఇక లేరు అనే విషయాన్ని మనం జీర్ణించుకోలేం. ఎంతో బాధపడుతాం. అయితే అలాంటి బాధను సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ దూరం చేయనుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పనిచేసే ఒక చాట్‌బాట్‌ను రూపొందించింది. దానికి పేటెంట్‌ను కూడా పొందింది. సదరు చాట్‌బాట్‌ను చనిపోయిన వ్యక్తులకు చెందిన డేటా ఆధారంగా రూపొందిస్తారు. అంటే వారి అలవాట్లు, వాయిస్, ఇతర వివరాలను వారి ఫొటోలు, వారి డేటా, వారి వీడియోల ఆధారంగా సేకరిస్తారు. అనంతరం చాట్ బాట్‌ను రూపొందిస్తారు. దీంతో ఆ చాట్‌బాట్ చనిపోయిన వ్యక్తిలాగే మాట్లాడుతుంది, ఆ వ్యక్తికి తెలిసిన వారిని పలకరిస్తుంది. వారితో సంభాషిస్తుంది. ఈ క్రమంలో చాట్‌బాట్‌ను ఇంకొంత డెవలప్ చేసి 2డి లేదా 3డి ఇమేజ్‌ను కూడా రూపొందించవచ్చు. దీంతో చనిపోయిన వారు తమ ఎదుటే ఉన్నట్లు ఇతరులకు అనుభూతి కలుగుతుంది. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తులతో మాట్లాడుతూ వారి ఎదుట ఉంటే వారి ఆత్మీయులు సాంత్వన చెందవచ్చు. మనస్సులో ఉండే బాధ తగ్గుతుంది.
అయితే ఈ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తుందా, ఇంకా పరిశోధనలు చేస్తుందా, దీన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తెస్తారా ? అన్న వివరాలు తెలియలేదు. కానీ మీటింగ్ యు పేరిట ఓ కొరియన్ టీవీ వారు సరిగ్గా ఇలాంటి థీమ్‌తోనే ఓ షోను నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రేరణగా తీసుకుని మైక్రోసాఫ్ట్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిందా, లేదా సొంత పరిజ్ఞానమా అన్న వివరాలు తెలియలేదు, కానీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు.