వాట్సాప్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలి.. కొత్త స్కామ్‌ వచ్చింది..!

-

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే వాట్సాప్‌ ఇప్పుడు హ్యాకర్లు, స్కామర్లకు వేదికగా మారింది. వారు ఆ మాధ్యమాన్ని లక్ష్యంగా చేసుకుని యూజర్లను మోసం చేస్తున్నారు. వారి డేటాను చోరీ చేయడంతోపాటు డబ్బును కూడా కాజేస్తున్నారు. ఇక గతేడాది వెలుగు చూసిన వాట్సాప్‌ ఓటీపీ స్కామ్‌ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ స్కామ్‌తో మళ్లీ దుండగులు యూజర్లను మోసం చేస్తున్నారు. కనుక ఈ స్కామ్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటీ ఓటీపీ స్కామ్‌ ?

వాట్సాప్‌ యూజర్లకు ఏదైనా తెలియని నంబర్‌ లేదా స్నేహితుడి లాంటి నంబర్‌ నుంచి వాట్సాప్‌ సందేశం వస్తుంది. వారు యూజర్లకు తెలియకపోయినా స్నేహితుల్లా పరిచయం చేసుకుంటారు. తమ వాట్సాప్‌ పనిచేయడం లేదని, కనుక యూజర్ల నంబర్‌ ఇచ్చామని, దానికి ఓటీపీ వస్తుందని, అది చెప్పాలని కోరుతారు. అది నిజమే అని నమ్మే యూజర్లు తమకు వచ్చే వాట్సాప్‌ ఓటీపీని వారికి చెబుతారు. దీంతో యూజర్లకు చెందిన వాట్సాప్‌ అకౌంట్‌ లాగౌట్‌ అవుతుంది. దుండగులు యూజర్ల వాట్సాప్‌ అకౌంట్‌లోకి ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అవుతారు. దీంతో డేటాను యాక్సెస్‌ చేస్తారు.

యూజర్లు ఈ విధంగా ఓటీపీ ద్వారా తమ వాట్సాప్‌ అకౌంట్‌ను కోల్పోతారు. దీంతో దుండగులు యూజర్ల వాట్సాప్‌ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక పనులకు ఉపయోగిస్తారు. ఇదీ.. ఓటీపీ స్కామ్‌. దీని నుంచి యూజర్లు జాగ్రత్తగా ఉండాలి.

మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్‌ ఓటీపీని ఇతరులతో పంచుకుంటే వెంటనే గుర్తించాలి. వాట్సాప్‌ అకౌంట్‌ను రీసెట్‌ చేయాలి. లేదా యాప్‌ను తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్‌ చేసి ఓటీపీ ద్వారా మళ్లీ లాగిన్‌ అవ్వాలి. దీంతో మోసం జరగకుండా చూసుకోవచ్చు. లేదంటే మీ వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌ అవుతుంది. దాంతో హ్యాకర్లు మీ పేరిట చట్ట వ్యతిరేక పనులు చేస్తారు. తరువాత మీరే చిక్కుల్లో ఇరుక్కుంటారు. కనుక ఇలాంటి మోసాల పట్ల వాట్సాప్‌ యూజర్లు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని సూచనలు

1. వాట్సాప్‌ ఎప్పుడూ మీరు అడగకుండా ఓటీపీ పంపదు. కనుక మీరు అడిగినట్లు ఓటీపీ పంపితే దాన్ని ఫ్రాడ్‌గా గుర్తించాలి.

2. ఒక వేళ మీరు ఓటీపీ అడిగి ఉంటే అది దేనికి వచ్చిందో గుర్తించండి. అవతలి వ్యక్తి మీకు ఎలా తెలుసా ? అతను మీ స్నేహితుడా, కాదా అన్న విషయాన్ని ముందుగా నిర్దారించుకోండి.

3. ఓటీపీలను ఇతరులతో ఎట్టి పరిస్థితిలోనూ షేర్‌ చేయరాదు. అలా చేస్తే మనం చేసే తప్పుకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కనుక ఓటీపీలను ఇతరులకు షేర్‌ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version