క్రెడిట్ కార్డు” ఈ రోజుల్లో ఇది లేకుండా ఏ పని జరిగే పరిస్థితి కనపడటం లేదు. ప్రతీ చిన్న అవసరానికి కూడా క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనేది వాస్తవం. ఇక బ్యాంకు లు కూడా వీటిని విచ్చలవిడిగా ఇవ్వడంతో క్రెడిట్ కార్డ్ కి అలవాటు పడిపోతున్నారు జనం. నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత వీటి వాడకం క్రమంగా పెరిగిపోయింది. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా క్రెడిట్ కార్డ్ ని తీసుకొని దాని ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక మరికొందరు అయితే వాటి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
మరి క్రెడిట్ కార్డ్ పోతే…? పరిస్థితి ఏంటి…? పోయినా సరే దానికి ఒక ప్లాన్ ఉందని అంటున్నాయి బ్యాంకు లు… అదేంటో ఒక్కసారి చూద్దాం… వివిధ బ్యాంకులు, బీమా కంపెనీలు కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ)ని అందిస్తున్నాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, పాన్ కార్డుకు భద్రత కల్పిస్తుంది. బ్యాంకు లు అందించే కార్డు ప్రొటెక్షన్ ప్లాన్లను సర్వీసు, కాలపరిమితి ఆధారంగా తీసుకోవాలి. రూ.900- రూ.2100 మధ్యలో కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ వార్షిక ప్రీమియం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్,
ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్ సహా పలు బ్యాంక్లు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. స్కిమ్మింగ్, నకిలీ, ఫిషింగ్, ఆన్‌లైన్ వాడకం, పిన్, నష్టం/ దొంగతనం వంటి వాటికి ఈ ప్లాన్ లు వర్తిస్తాయి. ఎక్కువ కార్డులను ఉపయోగించేవారికి ఇది ఉపయోగపడుతుంది. కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.6.16 లక్షల వరకు హోటల్ బిల్లును, ప్రయాణం ఖర్చు కింద రూ.1.6 లక్షలు ఇస్తుంది. అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ కుటుంబ సభ్యులను కార్డు ప్రొటక్షన్ ప్లాన్‌లో చేర్చవచ్చు.
మీరు ఎంచుకున్న ప్లాన్ ని బట్టి అత్యవసర నగదు మొత్తం ఉంటుంది. మీ కార్డుకి ఏదైనా నష్టం జరిగితే 24 * 7 టోల్ ఫ్రీ నెంబరు అందుబాటులో ఉంటుంది కాబట్టి కార్డు బ్లాక్ చేయమని కోరవచ్చు. అత్యవసరంగా అన్ని కార్డులు బ్లాక్ చేయాల్సి వస్తే, ఒక్కొక్క బ్యాంకుకు విడివిడిగా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్ ప్రొటక్షన్ ప్లానలో మీ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఉండవచ్చు. కాబట్టి క్రెడిట్ వాడుతుంటే మాత్రం ఈ ప్లాన్ ని తీసుకోమని సూచిస్తున్నారు పలువురు.