పాకిస్తాన్‌లో హనుమంతుడి ఆనవాళ్ళు బయటపడ్డాయి. కరాచీలోని సోల్జర్ బజార్లోని చారిత్రాత్మక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల నేపథ్యంలో అక్కడ వందల ఏళ్లనాటి భక్త హనుమాన్ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు అత్యంత పురాతనమైనవిగా పాకిస్తాన్ పురావస్తు శాఖ అధికారులు తేల్చారు. ఇవి పదిహేను వందల సంవత్సరాలకు చెందిన అధికారులు భావిస్తున్నారు. సోల్జర్ బజార్ లో ఉన్న పంచముఖ హనుమాన్ మందిరం తవ్వకాల్లో ఈ విగ్రహాలు బయటపడ్డాయి.
విచిత్రం ఏంటంటే పదిహేను వందల యేళ్ళ తర్వాత ఈ విగ్రహాలు బయల్పడినా వీటిపై ఉన్న సింధూరం ఆనవాళ్ళు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలను అప్పట్లోనే అతి విలువైన రాయితో చెక్కారు. ఈ విగ్రహాలలో హనుమంతుడు, గణేశుడు, నంది మొదలైనవి ఉన్నాయి. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా అక్కడి పనివారికి ఈ విగ్రహాలు లభ్యమయ్యాయి. తొమ్మిది హనుమాన్ విగ్రహాలతో పాటు గణేషుడు విగ్రహాలు, షెరావాలి మాతా విగ్రహాలు, కొన్ని మట్టి కుండలు లభ్యమయ్యాయి.
ఇక ఇటీవల పాకిస్తాన్‌లోని పురాతన హిందూ దేవాలయాల పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం నడుము బిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని నిధులు కూడా విడుదల చేస్తోంది. ఇక ఈ పంచముఖ ఆంజనేయ ఆలయానికి పాక్‌లో చాలా విశిష్టత ఉంది. ఆ ఆలయం చుట్టూ 11 లేదా 21 సార్లు భక్తులు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్మేవారట. ఈ హనుమంతుడి విగ్రహాలు స్వయంభూగా వెలసాయని భక్తులు నమ్మేవారు. ఇక శ్రీరాముడు కూడా ఈ ఆలయం సందర్శించాడన్న ప్రతీతి.
ఇక గతంలో భారత్‌లో కలిసి ఉన్నప్పుడు పాక్‌లో ఎన్నో హిందూ దేవాలయాలు ఉండేవి. ఆ తర్వాత దేశ విభజన జరిగాక వీటిల్లో చాలా వరకు మూసేశారు. కొన్ని ఆలయాలను మాత్రం ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు. వీటిల్లోకి హిందూ భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఈ ఆలయాల్లో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోగా… కొన్ని మాత్రం ఇప్పటకీ అలాగే ఉన్నాయి.