క్లాసిఫైడ్ సైట్ల‌లో మోసాల ప‌ట్ల జాగ్ర‌త్త‌.. ఈ సూచ‌న‌లు పాటించండి..

-

సాధార‌ణంగా మ‌న దేశంలో కొత్త వ‌స్తువుల‌ను ఎలాగైతే కొంటారో.. సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనేవారు కూడా చాలా మందే ఉంటారు. ఈ క్ర‌మంలో సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు మ‌న‌కు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్‌లు బాగా పేరుగాంచాయి.

* సెకండ్ హ్యాండ్ వ‌స్తువులు సాధార‌ణంగానే చాలా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తాయి. కానీ వాటిని మ‌రీ చాలా త‌క్కువ ధ‌ర‌కైతే అమ్మ‌రు క‌దా.. క‌నుక ధ‌ర మ‌రీ తక్కువ‌గా ఉందంటే న‌మ్మ‌కండి. చాలా మంది ఇక్క‌డే బోల్తా ప‌డ‌తారు. సాధార‌ణంగా రూ.20వేలు ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్‌ మార్కెట్‌లో రూ.10వేలు ఆపైన ధ‌ర ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ మ‌రీ దాన్ని రూ.5వేల‌కు అమ్మ‌రు. బాగా పాత మోడ‌ల్ అయితేనే ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది. కానీ కొత్త మోడ‌ల్ అయితే ధ‌ర మ‌రీ అంత త‌క్కువ‌గా ఉండ‌దు. క‌నుక‌ ఇలాంటి విష‌యాల‌ను గ్ర‌హిస్తే సైబ‌ర్ మోసాల బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్తగా ఉండ‌వ‌చ్చు.

* క్లాసిఫైడ్ సైట్ల‌లో మ‌న‌కు క‌నిపించే ఏ వ‌స్తువును కొనుగోలు చేసినా స‌రే.. దాన్ని పొందేందుకు ముందుగానే డ‌బ్బులు ఖాతాలో జ‌మ చేయాల‌ని ఎవ‌రైనా అడిగితే దాన్ని క‌చ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే.. సెకండ్ హ్యాండ్ అనే కాదు, ఏ వ‌స్తువును అయినా స‌రే ముందుగా మ‌నం చూసి, అది న‌చ్చితేనే క‌దా కొంటాం. అలా కాకుండా దాన్ని ఎవ‌రూ చూపించ‌కుండా, దాన్ని ఎవ‌రు అమ్ముతున్నారో తెలియ‌కుండా, ఆ వ్య‌క్తి మ‌న ద‌గ్గ‌ర లేకుండా.. వారు అడిగారు క‌దా అని చెప్పి డ‌బ్బుల‌ను వారి ఖాతాలో జ‌మ చేయ‌రాదు. అలా అడిగితే క‌చ్చితంగా వారు మ‌న‌ల్ని మోసం చేస్తార‌ని గ్ర‌హించాలి. వ‌స్తువును వారినే స్వయంగా మ‌న‌కు చూపించ‌మ‌ని అడ‌గాలి. ఆ వ‌స్తువు వారిద‌ని చెప్పేందుకు వారి వ‌ద్ద ఏవైనా బిల్ పేప‌ర్లు ఉంటే చూపించ‌మ‌ని చెప్పాలి. అలా కుద‌రక‌పోతే వారు మ‌న‌ల్ని క‌చ్చితంగా మోసం చేస్తున్నార‌ని తెలుసుకోవాలి.

* సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు అవ‌త‌లి వ్య‌క్తుల నుంచి వారి ధ్రువ‌ప‌త్రాల జిరాక్సుల‌ను అయినా తీసుకోవాలి. వారి గుర్తింపు కార్డు, మొబైల్ నంబ‌ర్‌, చిరునామా.. త‌దిత‌ర వివ‌రాల‌ను ప‌క్కాగా సేక‌రించాలి. భ‌విష్య‌త్తులో ఆ వ‌స్తువుల‌తో మీకు ఏమీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.

* కార్ల వంటి వాహ‌నాల‌ను కొనుగోలు చేసే వారు సేల్ డీడ్ తో పాటు డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి. అప్ప‌టి వ‌ర‌కు ఆ వాహ‌నంపై ఉండే చ‌లాన్లు లేదా ఏవైనా నేరాలు జ‌రిగి ఉంటే.. ఆ వాహ‌నం పాత ఓన‌ర్‌దే బాధ్య‌త అని చెబుతూ ఆ ఓన‌ర్ నుంచి డిక్ల‌రేష‌న్ తీసుకోవాలి. లేక‌పోతే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

* సెకండ్ హ్యాండ్ వ‌స్తువుల‌ను కొనేట‌ప్పుడు ఆ వ‌స్తువుల‌ను చూపించ‌మ‌ని అమ్మేవారిని అడ‌గాలి. వారే స్వ‌యంగా వ‌చ్చి ఆ వ‌స్తువును చూపించాల‌ని కోరాలి. అన్నీ కుదిరాకే ఓకే అనుకుంటే వ‌స్తువును కొనాలి. అంతేకానీ.. అమ్మేవారు లేకుండా, దాని ఓన‌ర్ ఎవ‌రో స‌రిగ్గా తెలియ‌కుండా మ‌నం వ‌స్తువుల‌ను కొన‌రాదు. కొంటే ఇబ్బందులే ఎదుర‌వుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version