ఇన్సురెన్స్‌ పాలసీ తీసుకునేప్పుడు ఆ నిజం దాచాడు.. రూ. 50 లక్షలు గోవిందా..

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాంటి పాలసీలు తీసుకునేప్పుడు మన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తిగా చెప్పాలి. దాన్ని బట్టే స్కీమ్స్‌, బెనిఫిట్స్‌ ఉంటాయి. పాలసీ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ అన్నీ శ్రద్ధగా చదివి మరీ సైన్‌ చేయాలి. మనకు షుగర్‌, బీపీ, ఇంకా ఎలాంటి రోగాలు ఉన్నా సరే.. ఆ విషయం ఇన్సురెన్స్‌ కంపెనీకి చెప్పాలి. షుగరేలే అని లైట్‌ తీసుకుంటే రావాల్సిన క్లైయిమ్‌ మనీ రాకుండా పోతాయి. ఇక్కడ ఒక పాలసీదారుడు ఇలానే చేశాడు. చిన్న అబద్ధం ఖరీదు లక్షల రూపాయలు. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే అబద్ధం ఎందుకు చెప్పకూడదో అర్థమవుతుంది.

 

లక్కసంద్ర నివాసి ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో 31 సంవత్సరాల పాటు జీవిత బీమా పాలసీని తీసుకున్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినీకి, అతని భార్యకు రూ. 50 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. ఇది మార్చి 12, 2021 నుంచి మార్చి 12, 2052 వరకు చెల్లుబాటులో ఉంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ సమయంలో మే 1, 2021న భర్త చనిపోయాడు. అతని అకాల మరణం తర్వాత, భార్య ఇండియాఫస్ట్‌కి దరఖాస్తు చేసింది . జీవిత భీమా 50 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి అప్లై చేసుకుంది. అయితే ఇండియాఫస్ట్ ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. క్లెయిమ్‌ రాదని చెప్పింది. బీమా సంస్థపై ఫిర్యాదుతో మహిళ ఫిబ్రవరి 2022లో శాంతినగర్‌లోని బెంగళూరు అర్బన్ ఫస్ట్ అడిషనల్‌ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించింది.

మహిళ తరఫు న్యాయవాది తన వాదనను వినిపించారు. అటు బీమా సంస్థ ప్రతినిధి కోర్టుకు చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 12, 2021న చెల్లించాల్సిన రూ. 1,396 వార్షిక ప్రీమియం చెల్లించడంలో విఫలమయ్యారని.. మే 1, 2021న కోవిడ్‌తో మరణించారని పేర్కొంది. అతని మరణం సమయంలో పాలసీ వర్కింగ్‌లో లేదని కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా, అతను డయాబెటిస్‌తో బాధపడుతున్నాడని 2011 నుంచి ఇన్సులిన్‌పై ఆధారపడి ఉన్నాడని ఫ్రూఫ్స్‌ చూపించింది.

పాలసీని ఎంచుకునే సమయంలో అతను తన వైద్య పరిస్థితి గురించి నిజం దాచినట్టు బీమా సంస్థ సాక్ష్యాలతో సహా కోర్టుకు చూపించింది. రెండు వర్గాల వాదన విన్న ధర్మాసనం బీమా చేసిన వ్యక్తి తన డయాబెటిక్ స్థితిని చెప్పకపోవడంతో రూ.50 లక్షల జీవిత బీమా క్లెయిమ్‌కు మహిళకు అర్హత లేదని పేర్కొంటూ కేసును కొట్టేసింది. భర్త చెప్పిన ఒకే ఒక అబద్ధం రూ. 50 లక్షలు రాకుండా చేశాయి. డయబెటీస్‌ ఉందని చెప్తే ఏం కాదు. దాన్ని బట్టి కంపెనీ ఇంకొన్ని కండీషన్స్‌ జోడిస్తుంది అంతే.. పాలసీలు తీసుకునేప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version