బాహుబలి 2 సినిమా తర్వాత అనుష్క శెట్టి సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఆ సినిమా తర్వాత ఆమె భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో మాత్రమే నటించింది. చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా ఆమె మొదట్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ మెగాస్టార్ చిత్రాన్ని రిజెక్ట్ చేస్తే విమర్శల పాలవుతానన్న భయంతో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఆమె తాజాగా నటించిన నిశ్శబ్దం సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తికాగా… అది ఓటిటి ప్లాట్ఫామ్ పై విడుదల కానుందని తెలుస్తోంది.
ఈ సినిమా తర్వాత అనుష్క తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తో కలిసి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది కానీ గౌతమ్ మీనన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఇప్పట్లో సినిమా తీసే పరిస్థితిలో లేనట్టు కనిపిస్తున్నాడు. దీంతో అనుష్క శెట్టి తన తదుపరి చిత్రాల గురించి ఆలోచించడం పూర్తిగా మానేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఏ స్క్రిప్ట్ కూడా వినడానికి సిద్ధంగా లేదట. సరి కొత్త దర్శకులతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తానని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ తో చెప్పినట్టు సమాచారం.
అలాగే తనకు బాగా దగ్గరైన దర్శకులతో, నిర్మాతలతో కలిసి సినిమా తీసేందుకు ఒప్పుకుంటానని చెప్పిందట. దీన్ని బట్టి ఆమె ప్రతి రెండు సంవత్సరాలకి ఒకటో రెండో చిత్రాల్లో మాత్రమే నటిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్నాళ్ల తర్వాత నటన రంగానికి పూర్తిగా స్వస్తి చెప్పి వివాహం చేసుకుంటుందేమోనని సినీ వర్గాలలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.