దేశంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సమయంలో కరోనాను అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. ఇప్పటికి దేశంలో ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా దేశంలో తొలుత మూడు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపై దాన్ని మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ కారణంగా దేశంలో చాల వ్యాపార సంస్థలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇప్పటికీ చాలా రంగాలు లాక్ డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని, అయితే, అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు తెలియజేశాయి.