కరోనా చికిత్స ఖరీదైనది కాదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆక్సిజన్, మందులు అన్నీ కలిపినా పదివేలకు మించదని స్పష్టం చేశారు. రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు లేనేలేదన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇవాళ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన ఈటల.. సౌకర్యలను పరిశీలించారు. కరోనా ఆస్పత్రిగా ఉన్న గాంధీ.. పూర్తిగా రోగులతో నిండిందన్నారు. ఇప్పుడు పూర్తి కొవిడ్ ఆస్పత్రిగా ఉన్న టిమ్స్‌లో వసతులు, ఇతర సౌకర్యాలను నేరుగా పరిశీలించినట్లు తెలిపారు.
టిమ్స్‌లో మొత్తం1,350 పడకలు, ఇంటిన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్లతో కూడిన సదుపాయాలు ఉన్నట్లు ఈటల తెలిపారు. ఇంకా ఏంకావాలో చూస్తామని.. రోగుల భద్రత, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఔషధాలనూ టిమ్స్‌కు సమకూరుస్తామన్నారు. లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో చేరాలని ఈటల సూచించారు. కొందరు నాలుగైదు రోజులు ఆలస్యం చేస్తున్నారని ఫలితంగా వైరస్ తీవ్రత పెరుగుతోందన్నారు. అలాంటి వారిని రక్షించడం కష్టం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ స్థాయి తగ్గితే.. కృత్రిమ ఆక్సిజన్ ఏర్పాటుచేసినా బతకడం కష్టమవుతోందన్నారు. కరోనా నిర్ధారణ అయిన తర్వాత శ్వాస ఇబ్బంది తలెత్తితే.. తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు.