ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను యేడాది పాటు అధ్యక్షుడిగా కొనసాగించిన అధిష్టానం ఆ తర్వాత ఆయన్ను పక్కన పెట్టేసి తాజాగా రాజమండ్రికి చెందిన సోము వీర్రాజును నియమించింది. కన్నాతో పాటు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఇద్దరూ కూడా కాపులే కావడం విశేషం. దీనిని బట్టి ఏపీలో బీజేపీ కాపులను నమ్ముకుని రాజకీయం చేసేందుకు రెడీ అయ్యిందని అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలను కేవలం హిందూత్వ కోణంలో నడిపించిన బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కుల రాజకీయాలను ఆధారంగా చేసుకుని మళ్లీ క్యాస్ట్ పాలిటిక్స్‌నే నమ్ముకుంటోందని అర్థమవుతోంది.
వాస్తవంగా బీజేపీ ఆలోచించినట్టు ఏపీలో ఎప్పుడు కులం చుట్టూనే రాజకీయాలు నడుస్తుంటాయి. ఇక్కడ కాపులు చాలా బలంగా ఉన్నారు. అయితే కాపులు ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో కలిసి కట్టుగా ఉన్నట్టు చరిత్ర చెప్పడం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట ఉన్న కాపులు 1989లో తిరిగి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత 1994లో తిరిగి ఎన్టీఆర్‌కు పట్టంకట్టారు. ఇక 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినా కూడా కాపులు ఆ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేయలేదు. ఇక 2014లో మెజార్టీ కాపులు టీడీపీ వైపు మొగ్గు చూపగా.. 2019లో వీరిలో మెజార్టీ వైసీపీ వైపు మొగ్గు చూపగా.. ఆ తర్వాత జనసేన.. ఇక మూడో స్థానంలో టీడీపీ ఉన్నాయి.
2014లో చంద్రబాబు వైపు మొగ్గు చూపిన కాపులు 2019లో అదే టీడీపీని మూడో ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకున్నారు. 2009లో తమ కులానికే చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, 2019లో అదే కాపు వర్గానికి చెందిన పవన్ జనసేన పెట్టినా కూడా కాపులు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టలేదు. ఇక ఇప్పుడు బీజేపీ తీరు చూస్తుంటే ఆ పార్టీ కూడా కాపులకే పెద్ద పీఠ వేయాలని చూస్తున్నా.. కాపుల ఓటింగ్ తీరు గమనిస్తే మాత్రం బీజేపీని నిండా ముంచడం పక్కాయే అనిపిస్తోంది. ఇది అంతిమంగా అధికారంలో వైసీపీకి ప్లస్ అవ్వడంతో పాటు జగన్ నెత్తిన పాలుపోసినట్లవుతుంది అనడంలో సందేహమే లేదు. కాపు ఓటింగ్ జనసేన + బీజేపీ కొంత పంచుకున్నా.. వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, రెడ్లు ఉంటారు.. జగన్ బలం ఎలాగూ జగన్‌కు ఉంది. ఇక టీడీపీ ఈ దెబ్బతో మరింత కునారిల్లడం ఖాయం. మరి బీజేపీ ఏపీలో ఇంతకు మించిన కామెడీ రాజకీయం చేయడం ఆశ్చర్యంగానే ఉంది.