తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగ.. బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మని పేర్చి భక్తి శ్రద్ధలతో కొలిచి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఐతే ప్రతీ ఏటా బతుకమ్మ పండగ భాద్రపద మాసంలో వస్తుంది. కానీ ఈ సారి అధిక మాసం కారణంగా అశ్వయుజ మాసంలో జరగనుంది. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించింది. అధిక అశ్వయుజం కారణంగా బతుకమ్మ పండగ అశ్వయుజ మాసంలో అనగా అక్టోబర్ 16నుండి జరపనున్నారు. ఈ మేరకు పండితులు, పంచాంగ కర్తలతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నారు.
16వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మగా కొలవడం మొదలై, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మగా 24వ తేదీ వరకు సంబరాలు జరగనున్నాయి. అధికమాసం 19సంవత్సరాలకి ఒకసారి వస్తుందట. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడటం సాధారణమే అని పండితులు చెబుతున్నారు.