మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో దేశంలో ఉన్న చాలా మంది బ్యాంకింగ్ వినియోగదారులు ఆన్లైన్లో నగదును పంపించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రెండు రోజుల్లో చాలా మందికి ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యూపీఐ పరంగా సమస్యలు ఎదురయ్యాయి. తాము అవతలి వారికి పంపిన నగదు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి డెబిట్ అయ్యింది. కానీ అవతలి వారికి ఆ నగదు ఇంకా క్రెడిట్ కాలేదు. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది.
మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు. ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. కనుక బ్యాంకుల సర్వర్లు సహజంగానే డౌన్ అయ్యాయి. అందువల్లే అనేక మంది వినియోగదారుల ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక వినియోగదారులు ఆయా సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.. అని ఎన్పీసీఐ రిప్లై ఇచ్చింది.
అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు డెబిట్ అయి అవతలి వారికి కూడా క్రెడిట్ అవకపోతే వినియోగదారులు ట్రాన్సాక్షన్ అయిన సమయం నుంచి ఒక రోజు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు కచ్చితంగా నగదు వారికి గానీ, అవతలి వ్యక్తులకు గానీ క్రెడిట్ అవుతుంది. అలా కూడా జరగకపోతే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. దీంతో ఒక్క రోజు ముగిసిన తరువాత నుంచి నగదు క్రెడిట్ అయ్యే వరకు రోజుకు రూ.100 చొప్పున బ్యాంకులు కస్టమర్లకు నష్ట పరిహారం చెల్లించాలి. ఇక నెల రోజులు అయినప్పటికీ నగదు ఇంకా క్రెడిట్ అవకపోతే వినియోగదారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు.