ఇదంతా స్మార్ట్ దొంగల జనరేషన్. అవును.. మీ ఇంట్లోకొచ్చి దొంగతనం చేసే రోజులు పోయాయి. మీ స్మార్ట్ ఫోన్ లో దొంగతనం చేసే రోజులొచ్చాయి. మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే మీ అకౌంట్లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దాని కోసం వాళ్లు ఉపయోగించే టెక్నికే స్విమ్ స్వాప్. అంటే మీ సిమ్ కార్డు ద్వారానే మీ అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేస్తారు.
సిమ్ స్వాప్ చేయడానికి ముందే ఎవరి అకౌంట్ లో అయితే డబ్బులు కాజేయాలనుకుంటారో.. ఆ కస్టమర్ డిటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అంటే.. వాళ్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిటెయిల్స్ ముందే కాజేస్తారు. దానికి మరో టెక్నిక్ ఉపయోగిస్తారు. కస్టమర్ కు ఫిషింగ్ మెయిల్ పంపించి.. ఫేక్ లింక్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తస్కరిస్తారు. తర్వాత స్విమ్ స్వాప్ టెక్నిక్ ద్వారా మొబైల్ నెంబర్ ను కూడా డియాక్టివేట్ చేస్తారు.
దానికి మరో టెక్నిక్ ఉపయోగిస్తారు. కస్టమర్ కు కాల్ చేసి… మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ చేస్తున్నామని.. మీకు ఫ్రీ ఆఫర్ ఉందని.. డేటా ఆఫర్ ఉందని నమ్మబలుకుతారు. దాని కోసం మీ సిమ్ కార్డు వెనుక ఉన్న 20 అంకెల సిమ్ నెంబర్ చెప్పాలంటూ అడుగుతారు. కస్టమర్.. తన సిమ్ కార్డు 20 అంకెల నెంబర్ చెప్పగానే.. వెంటనే ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ డియాక్టివేషన్ కోసం రిక్వెస్ట్ పెడతారు. తర్వాత సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ వస్తోంది. వాళ్లు 1 నొక్కమని చెబుతారు. కస్టమర్ ఎప్పుడైతే 1 నొక్కుతాడో అంతే.. సిమ్ డియాక్టివేషన్ కు అంగీకరించినట్టే. అంతే.. వెంటనే కస్టమర్ మొబైల్ నెంబర్ తో కొత్త సిమ్ తీసుకుంటారు సైబర్ క్రిమినల్స్.
కొత్త సిమ్ లో కస్టమర్ మొబైల్ నెంబర్ యాక్టివేట్ కాగానే… తమ పని కానిస్తారు. ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఫోన్ పని చేయడం లేదని కస్టమర్లు అనుమానపడకుండా… సైబర్ నేరగాళ్లు.. ఇంటర్నెట్ కాల్స్, స్కైప్ కాల్స్ చేస్తుంటారు. మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. దీంతో ఫోన్ బాగానే ఉందని కస్టమర్ అనుకుంటాడు. కానీ.. ఇంతలోనే అంతా అయిపోతుంది. కస్టమర్ అకౌంట్ లో నుంచి డబ్బులు అన్ని ఖతమయిపోతాయి. అప్పుడు కస్టమర్ లబోదిబోమనాల్సి వస్తోంది.