Telangana : కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

-

తెలంగాణ హైకోర్టులో నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం జరిగింది. మరో ఆరుగురు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేశ్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ జె. శ్రీనివాసరావు, జస్డిస్‌ నామవరపు రాజేశ్వరరావు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్‌ వారితో ప్రమాణం చేయించారు. నూతన న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు.

జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌ కరీంనగర్‌ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. కొంత కాలం కరీంనగర్‌లో ప్రాక్టీస్‌ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దివంగత రామ్‌జెఠ్మలానీ వద్ద జూనియర్‌గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2021లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

జస్టిస్‌ నగేష్‌ భీమపాక.. భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరావు, శాంతమ్మలకు 1969 మార్చి 8న జన్మించారు. ఏలూరు సీఆర్‌ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. లాలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ను హైదరాబాద్‌ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993లో బార్‌ కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్‌ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ పుల్లా కార్తీక్‌.. జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మలకు 1967 జూన్‌ 4న జన్మించారు. ఉస్మానియాలో లా, ఎల్‌ఎల్‌ఎంలు చదివారు. 1996లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించి, 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ కాజ శరత్‌.. భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబలకు 1971 జనవరి 29న జన్మించారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియాలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1997లో బార్‌కౌన్సిల్‌లో నమోదయ్యాక కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.

జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు.. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. ఉస్మానియాలో బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1999లో బార్‌కౌన్సిల్‌లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు.

జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు.. మహబూబాబాద్‌ జిల్లా సూదనపల్లిలో ఎన్‌.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్‌ 30న జన్మించారు. పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తెలంగాణలో యూజీసీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రైబ్యునల్‌ ప్యానెల్‌ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు. సివిల్‌, ఆర్థిక నేరాలు, కార్పొరేట్‌ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news