మార్చి 3న విడుదలైన ఈ బలగం సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ తెలంగాణ దినపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ గడ్డం సతీష్ బలగం సినిమా కథ నాదేనని అంటున్నారు. 2011లో తాను రాసిన పచ్చికి కథను బలగం పేరుతో కాస్త చిన్న మార్పులు చేసి తెరకెక్కించారని అంటున్నారు. ఈ వివాదం గురించి గడ్డం సతీష్ మాట్లాడుతూ, “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర కథలతో సినిమాలు చేసి కమర్షియల్ సక్సెస్ సాధించిన వ్యక్తి దిల్ రాజు.
ఆయన దృష్టి ఇప్పుడు తెలంగాణపై పడటం అనేది మంచి విషయమే. అయితే సాధారణంగా ఆయన సినిమాలు చేసేటప్పుడు ఆ కథకు మూలం ఏంటనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాసిన పాత కథను తీసుకొని దాన్ని కొంత మార్చి బలగం అనే టైటిల్ పెట్టి సినిమా చేయటం అనేది చాలా సిగ్గుచేటు. 2011 లోనే నేను పచ్చికి కథను రాశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ యాస నిరాదరణకు గురైంది. తెలంగాణలో మాట్లాడితే ఈసడించుకునేవారు. నేను తెలంగాణ మాండలికంలో కథ రాసినప్పుడు ఆంధ్ర పత్రికలు కథను అచ్చు వేయలేమని చెప్పి తీసి పడేశారు.
2011 నుంచి తెలంగాణ మాండలికంలోనే కథలు రాస్తూ వచ్చాను. ఈ పచ్చికి కథ కారణంగానే నాకు నమస్తే తెలంగాణ పత్రికలో ఉద్యోగం కూడా వచ్చింది. 2011లో రాసిన పచ్చికి కథను 2014లో నమస్తే తెలంగాణలోని బతుకమ్మలో అచ్చువేశారు. కానీ ఈ బలగం సినిమా చూసే సందర్భంలో నేను దర్శకుడు వేణు వెల్దండి ని కలిశాను. కానీ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. కామ్ గా వచ్చేసాను. రైటర్ గా నేను కోరుకునేది ఒకటే. కథకు సంబంధించిన క్రెడిట్ నాకే ఇవ్వాలి. దానికి సంబంధించి దిల్ రాజు గారు చర్యలు తీసుకోవాలి. ఆయన చర్యలు తీసుకోకపోతే నేను చట్టపరంగా ముందుకు వెళతాను” అన్నారు.