షాపింగ్ మాల్‌లో ఫ్రిజ్‌ తెరవబోయి కరెంట్​షాక్​తో చిన్నారి మృతి

-

తండ్రితో కలిసి సరదాగా షాపింగ్ మాల్​కు వెళ్లిన ఓ చిన్నారి అనుకోని ప్రమాదం బారిన పడి మృతి చెందింది. ఐస్​క్రీమ్ కోసం ఫ్రిజ్ తలుపు తెరుద్దామని.. ఫ్రిజ్​ను ముట్టుకోగానే విద్యూదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలింది. తన కూతుర్ని కాపాడుకుందామని నాలుగైదు ఆస్పత్రులు తిరిగిన ఆ తండ్రికి చివరకు విగతజీవిగా మారిన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్​లో సోమవారం రోజున చోటుచేసుకుంది.

ఎస్సై రాహుల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్‌ ఆదివారం తన కుటుంబంతో కలిసి నందిపేట్‌లోని అత్తారింటికి వెళ్లారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళ్తుండగా.. కుమార్తె రిషిత(4) ఐస్‌క్రీం కావాలని కోరింది. నందిపేట్‌లోని ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను ముట్టుకోగానే.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే బిగుసుకుపోయింది.

కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు పాపకు పల్స్ లేదని చెప్పారు. అయినా ఆశతో రాజశేఖర్ నాలుగైదు ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. అన్నిచోట్లా అదే సమాధానం రావడంతో చివరకు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news