హమాస్​తో మాకు సంబంధం లేదు : పాలస్తీనా అధ్యక్షుడు

-

ఇజ్రాయెల్- హమాస్​ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ పౌరులు, మహిళలు, చిన్నారులపై హమాస్ మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్న తీరుని చూసి ప్రపంచం నివ్వెర బోతోంది. అక్కడ హమాస్ సృష్టిస్తున్న మరణ మృదంగాన్ని చూసి ఆవేదన చెందుతోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్లను మట్టిలో కలిపేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ పరస్పర దాడులపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్​ అబ్బాస్ స్పందించారు.

హమాస్‌ చేసే దురాగతాలతో పాలస్తీనా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అబ్బాస్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్​పై హమాస్​ చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవని తెలిపారు. కేవలం పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(అధికార పార్టీ) విధివిధానాలే దేశాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంటూ… ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పర దాడుల్ని, అమాయక ప్రజల ప్రాణాలు తీయడాన్ని ఆయన ఖండించారు. ఇరు వర్గాలు బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు ఈ విషయంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​తో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపారు. ఇజ్రాయెల్​పై హమాస్​ దాడిని ఖండించాలని.. హమాస్​ పాలస్తీనీయన్లకు ప్రతినిధి కాదని పునరద్ఘాటించాలని కోరినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news