ఏపీలోని ఆక్వా రైతులకు జగన్ సర్కార్ క్రేజీ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,230 ఆక్వాసాగు విద్యుత్ కనెక్షన్లను సబ్సిడీ అందించనున్నట్టు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సాడ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాములు తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు.
కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆక్వా సాగుకు సంబంధించి కొన్ని కీలక విషయాలపై తీర్మానాలు ఆమోదించారు. ఇప్పటికే రాష్ట్రంలో 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు సబ్సిడీకి అర్హత ఉన్నట్టు గుర్తించగా కొత్తగా మరో 4,230 కనెక్షన్లను కూడా ఆ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. నవంబర్ 1 నుంచి కొత్త కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపచేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.65 లక్షల ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉండగా 10 ఎకరాల లోపు 3.26 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.