హమాస్ సంస్థను సమూలంగా అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని కొన్ని దేశాలు కోరుతుండగా.. కాల్పుల విరమణ ప్రకటించాలని మరికొన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల వినతులపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కాల్పుల విరమణ అంటే.. హమాస్‌కు లొంగిపోవడమేనని నెతన్యాహు అన్నారు.
గాజాలో సుదీర్ఘకాలం ఉండాలని తాము అనుకోవడం లేదని.. గాజాను పాలించాలనే ఆలోచన తమకు లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాను ఆక్రమించుకోవాలని అనుకోవట్లేదని.. ఎవరినీ తరలించమని.. కానీ ఆ ప్రాంతానికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. పేదరికంలో ఉన్న ఆ నగరాన్ని పునర్నిర్మించాలని.. అక్కడ ప్రజాప్రభుత్వం రావాలిని ఆకాంక్షించారు. హంతకులను హతం చేసేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని.. దానివల్ల హమాస్ వంటి సంస్థలు తిరిగి పుట్టుకురాకుండా నిరోధించడం వీలవుతుందని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.