తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు సాగిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ సీటును దక్కించుకున్నారు. ఇక కామారెడ్డిలోనూ గెలుపు దిశగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రజలంతా ఫిక్స్ అయ్యారు. ఇక రేవంత్ ఇంటి వద్ద, గాంధీ భవన్ వద్ద హస్తం శ్రేణుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదుపరి కార్యాచరణను కేంద్ర అధినాయకత్వం నిర్ణయం మేరకు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడేం వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాక, వాళ్లు పెట్టిన ట్వీట్లకు తాము సమాధానం ఇస్తామని అన్నారు. అయితే, తెలంగాణ ప్రజలు ఇప్పటికే సమాధానం ఇచ్చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారని శివకుమార్ వ్యాఖ్యానించారు.