కడప జిల్లాలో ప్రతిపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నారని సోషల్ మీడియాలో, ఆర్కే మీడియాలో పేర్కొనడం జరిగిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి గారు సందర్శించారని, ఈ సందర్భంగా ఇడుపులపాయలో డాక్టర్ వై.యస్. సునీతా రెడ్డి గారిని ఆమె కలుసుకున్నారని, రానున్న ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి గట్టి అభ్యర్థులనే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయని, దాని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయని భావించవచ్చునని అన్నారు.
దెబ్బతిన్న ఇద్దరు ఆడ కూతుళ్లు శివంగుల్లా పోరాడే అవకాశం ఉందని, త్వరలోనే వై.యస్. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారో కూడా తెలిసిపోతుందని అనుకుంటున్నానని అన్నారు. ఆరు నెలలుగా హైకోర్టులో అజయ్ కల్లం రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడం లేదని, ప్రతి శుక్రవారం పిటిషన్ విచారణ జాబితాలో ఉన్నప్పటికీ, విచారణకు నోచుకోవడం లేదని, పిటిషన్ దాఖలు చేసిన వారే విచారణ చేపట్టాలని కోరాల్సి ఉందని, కానీ వారు అటువంటి ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే, ఇదో రకమైన కోర్టు క్రాఫ్ట్ అని అర్థమవుతుందన్నారు.