తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ముగిశాయి. ఇవాళ్టి సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించగా,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. అనంతరం ప్రసంగంపై చర్చ జరిగింది. మరోవైపు మండలిలో తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ బలపరిచారు. చర్చ జరిగిన అనంతరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఉభయ సభలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం తెలిపడంతో శాసనసభ రేపటికి వాయిదా పడింది.
మూడో రోజైన శనివారం రోజున రాష్ట్ర శాసనసభలో ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. రేపు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో పద్దు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారు. మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదించిన అనంతరం శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.