ఈ నెల 4న ఆదిలాబాద్ కు ప్రధాని మోడీ రానున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా పట్టణంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం. ముఖ్యంగా ఆదివారం, సోమవారం పట్టణంలో ఎలాంటి డ్రోన్లకు అనుమతి లేదన్నారు. సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
ప్రధానమంత్రి భద్రత చర్యల్లో భాగంగా స్థానిక ఏరోడ్రం మరియు పరిసర ప్రాంతాలు సాధారణ ప్రజలకు నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయని అందులో భాగంగా కచ్ కంటి గ్రామ ప్రజలు ఆదిలాబాద్ పట్టణానికి రావడానికి పాత సాత్నాల రహదారిని వాడుకోవాల్సిందిగా, ఎరోడ్రం లోనికి అనుమతి ఉండదని తెలిపారు.కె ఆర్ కె కాలనీ వాసులు పట్టణంలోకి రావడానికి మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు ఉన్న రోడ్డును వాడుకోవాల్సిందిగా తెలిపారు.
అంకులి, తంతోలి గ్రామ ప్రజలు పట్టణంలోకి రావడానికి కృష్ణా నగర్ మీదుగా మావల పిఎస్ ముందు ఉన్న రోడ్డును వాడుకోవాల్సిందిగా తెలిపారు. ప్రధానమంత్రి సభకు విచ్చేస్తున్న ప్రజలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల పార్కింగ్ ప్రదేశం వినాయక చక్నందుగల మధుర జిన్నింగ్ మరియు గౌతమ్ మోడల్ స్కూల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.