అతనికి ఆదర్శం దావూద్ ఇబ్రహీం… అతనిలా ఎదగాలని చూసాడు… అందుకోసం ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు… 18 ఏళ్ళ క్రితం హర్యానాలో చిన్న నేర౦గా మొదలైన అతని నేర చరిత్ర… నేడు 12 హత్యలు, 24 కిడ్నాపుల వరకు వెళ్ళింది. అతని పేరే నీరజ్ బవానా… దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో ఒంటరిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2015 ఏప్రిల్ లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా రికార్డుల కెక్కిన నీరజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి అతను ఆ జైల్లోనే ఉన్నాడు.
ఈ నేపధ్యంలో అతను కోరిన గొంతెమ్మ కోరికలు జైలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేసాయి. తనకు ఏమి తోచడం లేదని, తన కాలక్షేపానికి, ప్రశాంతంగా ఉండటానికి గాను కొన్ని ఏర్పాట్లు కావాలని అతను లేఖ రాసాడు. ఆ లేఖలో ఐపాడ్, ఎఫ్‌ఎం రేడియో, ఇంటి భోజనం, మాంసాహారం అయితే మంచిది అని విజ్ఞప్తి చేసాడు. ఇక తాను జైల్లో ఉండటం కారణంగా బరువు తగ్గిపోయాను అని ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించమని అధికారులను అతడు కోరాడు. దీనిపై తీహార్ జైలు అధికారులు స్పందించారు.
అసలు అతని కోరికలు జైలు నిబంధనలకు పూర్తిగా విరుద్దమని… జైలులో ఒక రేడియో ఉందని అందులో సంగీతం వినొచ్చని… ఇక తీహార్ జైలులో శాఖాహారం మాత్రమే ఇస్తామని వాళ్ళు స్పష్టం చేసారు. అలాంటి గొంతెమ్మ కోరికలు భవిష్యత్తులో కోరవద్దని కూడా వాళ్ళు అతనికి స్పష్టంగా చెప్పారు. ఇక ఇదిలా ఉంటే అతను పశ్చిమ ఢిల్లీలో పెద్ద ఎత్తున దోపిడి రాకెట్ నడిపాడు… అలాగే అక్రమ ఆయుధాలు, మందుగుండి సామాగ్రీ అక్రమ రవాణాలో అతను సిద్దహస్తుడు… ఈ కేసుల్లోనే అతన్ని అదుపులోకి తీసుకోగా ఆ తర్వాత అసలు నేరాలు బయటపడ్డాయి.