హిందూ మహా సముద్రంలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. మంగళవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు. బంగ్లాదేశ్‌లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్‌నకు చెందిన ‘అబ్దుల్లా’ అనే కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు చొరబడినట్లు నౌక యాజమాన్యం వెల్లడించింది.
అయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారని తెలిపింది. అందులో 23 మంది సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. దుండగులు నౌకను తమ అధీనంలోకి తీసుకున్నారని, అయితే సిబ్బంది మాత్రం సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం దాన్ని సోమాలియా తీరం దిశగా తీసుకెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించింది. బంగ్లాదేశ్ చరిత్రలో తమ ఓడలు హైజాక్‌కు గురవడం ఇది రెండోసారి. తాజా ఘటన ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. సోమాలియా పైరెట్లే దీనికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.