మస్తు షేడ్స్ ఉన్నయ్ రా నీలో.. ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు అభినవ్ గోమఠం. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అంటే అదే పేరుతో ఏకంగా సినిమా కూడా తీసేశారు. టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’. తిరుపతి రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలీ రాజ్, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ విడుదలకు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 29వ తేదీ (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మనోడీ స్టోరీ ఏంటంటే? : మనోహర్ (అభినవ్ గోమఠం) ఒక కళాకారుడు. ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి సిద్ధపడతాడు. అతడు జీవితంలో స్థిరపడలేదన్న కారణంతో వధువు మండపం నుంచి పారిపోతుంది. దీంతో అతడిని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చులకనగా చూడటం మొదలుపెడతారు. ఈ సంఘటనతో ఎలాగైనా జీవితంలో స్థిరపడాలనుకుంటాడు మనోహర్. ఈ క్రమంలోనే అతడికి ఉమ (వైశాలీ రాజ్)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. మనోహర్ – ఉమ పెళ్లి చేసుకున్నారా? మనోహర్ జీవితంలో ఎలా స్థిరపడ్డాడు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.