ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుకోని ప్రమాదానికి గురై మృతి చెందారు. సరదాగా స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ (పర్వతారోహణ) కు వెళ్లి ప్రమాదవశాత్తు జారి నదిలో పడ్డారు. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారత స్నేహితులతో కలిసి పెర్త్షైర్లోని ‘లిన్ ఆఫ్ తమ్మెల్’కి వెళ్లి.. అక్కడ రెండు నదులు కలిసే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.
సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టగా.. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వీరి మృతదేహాలు లభించాయి. ఈ ప్రమాదంపై లండన్లోని భారత హైకమిషన్ అధికారి ఒకరు స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్కు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.