సన్నవడ్లకు బోనస్ పెద్ద బోగస్.. కాంగ్రెస్ మరో హామీని తుంగలో తొక్కింది : హరీశ్ రావు

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందని మండిపడ్డారు. సన్నవడ్లకే రూ.500 బోనస్ అనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

‘‘రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పది శాతం పండే సన్న రకం వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. వాటికి మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్లో ధర వస్తుంది. దొడ్డు రకానికే గిట్టుబాటు ధర రాదు. బోనస్‌ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే. అలా కాకుండా సన్న రకాలకే బోనస్‌ ఇస్తామనడం, అదీ వచ్చే సీజన్‌ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ సీజన్‌ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

https://x.com/BRSHarish/status/1792579107466952818

Read more RELATED
Recommended to you

Latest news