మీరు అప్పుడప్పుడు చిన్న విషయాలకే విపరీతంగా కోపం తెచ్చుకుంటారా? మీ కోపాన్ని నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తోందా? మనిషి స్వభావం, ప్రవర్తనపై రాశిచక్రం (జోడియాక్ సైన్) ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. కొందరికి సహనం ఎక్కువ ఉంటే మరికొందరికి కోపం అనేది సహజంగానే ఎక్కువ ఉంటుంది. మరి ఏ రాశివారు తమ కోపాన్ని అదుపు చేసుకోలేక తరచుగా ఇబ్బందులు పడతారు? ఆ లిస్ట్‌లో ఏ రాసులు వున్నాయో తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులు సహజంగానే అగ్ని తత్వం లేదా ఉద్వేగ స్వభావం కలిగి ఉంటాయి. అందుకే వారు ఇతరులకంటే త్వరగా తీవ్రంగా కోపాన్ని వ్యక్తం చేస్తారు.
మేష రాశి : ఈ రాశివారు సహజంగానే ఉత్సాహం, ధైర్యం కలిగి ఉంటారు. అయితే, వీరు చిన్న విషయాలకే తొందరపాటుగా స్పందిస్తారు. వీరిని ఎవరైనా అడ్డుకుంటే లేదా ఆలస్యం చేస్తే వీరికి వెంటనే చిర్రెత్తుకొస్తుంది. వీరి కోపం త్వరగా వస్తుంది, కానీ అదే వేగంతో చల్లారుతుంది. కోపంలో మాట తూలడం వీరి ప్రధాన సమస్య.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశివారు అంతర్ముఖులు. వీరు తమ భావాలను లోపలే దాచుకుంటారు, కానీ ఒకసారి కోపం వస్తే దాన్ని నియంత్రించడం కష్టం. వీరి కోపం వెంటనే పైకి కనిపించకపోయినా, అది లోపల ప్రతీకారం లేదా మూర్ఖపు పట్టుదలగా మారుతుంది. వీరి కోపం చాలా కాలం ఉంటుంది దాన్ని మరచిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు.
సింహ రాశి : సింహ రాశివారు సహజంగానే ఆత్మగౌరవం ఎక్కువగా కోరుకుంటారు. వీరిని ఎవరైనా అగౌరవపరిచినా లేదా వీరి అధికారాన్ని ప్రశ్నించినా, వీరి కోపం తీవ్రంగా ఉంటుంది. వీరు తమ కోపాన్ని బిగ్గరగా అరుస్తూ లేదా ఆవేశంగా స్పందిస్తూ వ్యక్తం చేస్తారు. అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు కాబట్టి కోపంలో కూడా నాటకీయంగా వ్యవహరిస్తారు.
కర్కాటక రాశి : ఈ రాశివారు చాలా సున్నితమైనవారు. ఇతరుల మాటలను వీరు త్వరగా మనసులోకి తీసుకుంటారు. వీరికి కోపం వచ్చినప్పుడు, దాన్ని అరవడం కంటే, మౌనం లేదా ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తారు. వీరి కోపం అనేది భావోద్వేగాల నుంచి వస్తుంది, అందుకే దాన్ని అదుపు చేసుకోవడం వీరికి కష్టం. వీరు అసురక్షితంగా భావించినప్పుడు కోపం పెంచుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశులు కోపాన్ని నియంత్రించడంలో ఇబ్బందులు పడవచ్చు. అయితే, కోపం అనేది ఏ రాశివారికైనా ఏ మనిషికైనా సహజమే. మీ రాశి ఏమైనప్పటికీ, ఆత్మ పరిశీలన, ధ్యానం మరియు యోగా వంటి పద్ధతుల ద్వారా మీ కోపాన్ని కచ్చితంగా నియంత్రించుకోగలరు. మీ కోపాన్ని అదుపు చేసుకుంటే జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం రాశుల సాధారణ లక్షణాలు, నమ్మకాలు మాత్రమే. వ్యక్తి యొక్క ప్రవర్తన, స్వభావం అనేది పుట్టిన సమయం, లగ్నం, ఇతర గ్రహాల స్థానాలు మరియు వారి పెంపకంపై ఆధారపడి ఉంటుంది.