సోషల్ మీడియాలో వీడియోల కోసం, ఇన్ స్టా రీల్స్ కోసం యువత పిచ్చి పీక్స్ కు చేరిపోయింది. రీల్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యూస్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుని కన్నవాళ్లకు గుండెకోత మిగుల్చుతున్నారు. ఇంకొందరైతే రీల్స్ మోజులో తమ ప్రాణాలకే కాదు.. ఎదుటివారికి కూడా ముప్పు తెస్తున్నారు. అయితే తాజాగా ఓ కుర్రాడు సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు ఓ వీడియో కోసం ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు.
నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడు ఏప్రిల్‌లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లి రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. ఆ తర్వాత తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్‌ఎస్‌ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు రావడం.. పట్టాలు తప్పడం వెనువెంటనే జరిగాయి. ఆ బాలుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకొన్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టి కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఆ బాలుడి వచ్చినట్లు గుర్తించి అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.