అందానికి ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కీరదోసకాయ కూడా ఒకటి. దీన్ని వంటల్లో వాడుకోవచ్చు. బ్యూటీ టిప్స్‌లో వాడుకోవచ్చు. అయితే అందరూ కీరాదోసకాయను వాడేప్పుడు చాలావరకూ తొక్క తీసేసి వాడతారు. కళ్లకు అయితే అలానే సన్నగా స్లైసెస్ లెక్క కట్ చేసి వాడుకుంటాం. వంటల్లో కానీ, పేస్ట్‌లా చేసి ముఖానికిపెట్టాలన్నా తొక్కతీసి పక్కనేస్తాం. కానీ కీరాదోస కాయ తొక్కతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే..ఈ ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాల్సిందే..!
కీరదోసకాయ తొక్క నీళ్ళు..
ఇల్లు అందంగా ఉండటం కోసం దాదాపు అందరూ ఇప్పుడు మొక్కలు పెంచుకుంటూనే ఉంటున్నారు. మొక్కల పెరుగుదల వేగంగా జరిగేందుకు ఈ కీరదోసకాయ తొక్కల నీళ్ళు ఉపయోగించవచ్చు. కీరదోస తొక్కలను ఒక సీసాలోకి తీసుకోవాలి. అవి మునిగేలా నీరు పోసి సీసా మూత పెట్టి 5 రోజుల పాటు అలాగే నాననివ్వాలి. తర్వాత తొక్కలు తీసి ఆ నీటిని మొక్కలకి పోస్తే చాలా మంచిది. ఈ నీటిలో మొక్కల పెరుగుదలకి అవసరమైన పాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎటువంటి తెగుళ్ళ బారిన పడకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ప్రతి 3 వారాలకు ఒకసారి ఈ నీటిని మొక్కలకు పోస్తే మంచి ఫలితం ఉంటుంది.
కీరదోసకాయ తొక్కలని నేరుగా మొక్క ఉన్న మట్టిలో గుచ్చవచ్చు. ఇలా చెయ్యడం వల్ల చీమల బెడద ఉండదు. చీమలు మొక్కల ఆకులని తిని వాటిని దెబ్బతీస్తాయి. తొక్కలు వేయడం వల్ల చీమలు మొక్కల దగ్గరకి రాకుండా ఉంటాయి. దోసకాయలో ఉండే ఆల్కలాయిడ్ సహజమైన రసాయనంగా పని చేస్తుంది. కీటకాలను సైతం దూరంగా ఉంచుతుంది.
కీరదోసకాయ తొక్క బూడిద
ఇది మొక్కల పెరుగుదలకి ఒక మ్యాజిక్ లాగా పని చేస్తుంది. దోసకాయ తొక్కలని బాగా ఎండలో ఎండబెట్టాలి. అవి ఎండిపోయాయాక అనుకున్న తర్వాత వాటిని కాల్చాలి. ఈ తొక్కలు బూడిదగా మారిపోతుంది. ఆ బూడిదను మొక్క పెరుగుతున్న మట్టిలో చల్లాలి. దీని వల్ల మొక్క పెరుగుదలకి అవసరమైన పోషకాలు వేగంగా విడుదల అవుతాయి. అప్పుడు మొక్క బాగా పెరుగుతుంది.