ఏపీలో మెగా డీఎస్సీ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. నవంబర్ 6న షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్-2024 విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాలతో నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మరో 2 రోజుల వ్యవధిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని సోమవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
కానీ, అనూహ్యంగా నోటిఫికేషన్ విడుదల నిలిచిపోయింది. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ అభ్యతరం వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లతో ఎస్సీకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపించింది. రిజర్వేషన్ల గురించి సీఎం చంద్రబాబుతో నిన్న మందకృష్ణ మాదిగ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం తేలకపోవడంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ పేర్కొంది. కాగా, ఏపీలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.