ర్యాగింగ్ చేయడం వల్ల కొందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దేశవ్యాప్తంగా ర్యాగింగ్ ని బహిష్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేసారు. దీంతో 10 మంది సీనియర్ వైద్య విద్యార్థులను సస్పెండ్ చేయడంతో ర్యాగింగ్ ఘటన బహిర్గతమైంది.
ఈనెల 10న కొందరూ ఫ్రెషర్స్ విద్యార్థులను రాత్రివేళ పలువురు సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థులు కాలేజీ డైరెక్టర్ కి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ విచారణలో కీలకంగా ఉపయోగపడింది. కాలేజీ డైరెక్టర్ 13న వారికి కౌన్సిలింగ్ చేసారు. క్రమశిక్షణ చర్య కింద ర్యాగింగ్ కు పాల్పడిన 2023 బ్యాచ్ రెండో సంవత్సరానికి చెందిన 10 మంది సీనియర్లను డిసెంబర్ 01వ తేదీ వరకు సస్పెండ్ చేశారు. కాలేజీలో ర్యాగింగ్ చేసినా.. మిస్ బిహేవ్ చేసినా తనకు ఫిర్యాదు చేయాలని డైరెక్టర్ రమేష్ విద్యార్థులకు సూచించారు.