తెలంగాణలో గిరిజనులు, దళిత రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించి అనుమతిని తెచ్చుకున్నారు. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా.. నేడు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని తలపెట్టింది.
ఇదిలాఉండగా, ఈ ధర్నాను అడ్డుకుని తీరుతామని స్థానిక కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో విస్తృతంగా ‘కేటీఆర్ గో బ్యాక్’ అనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్నా నేపథ్యంలో మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని దుండగులు చించివేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా, కేటీఆర్ కాసేపటి కిందటే రోడ్డు మార్గంలో మహాధర్నా కార్యక్రమం జరిగే ప్రదేశానికి బయలుదేరారు.