తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గురుకుల, మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పుడ్ పాయిజన్, హాస్టళ్లలో సౌకర్యాలు సరిగా లేక నానా అవస్థలు పడుతున్నారు. వారి సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్ విద్యార్థినుల ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని కుల్కచర్ల మండల పరిధి ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్ వసతి గృహాన్ని తాజాగా డీఈవో సందర్శించారు. ఆయనకు విద్యార్థులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ‘ఐదు నెలలుగా టిఫిన్‌గా పులిహోరనే పెడుతున్నారని.. ఏడాదిలో 10 రోజులు మాత్రమే పాలు ఇచ్చారు..రెండుసార్లే గుడ్లు ఇచ్చారు.
భోజనం బాగాలేక తినలేకపోతున్నాం.వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నాం. మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు బయట నుంచి తెచ్చుకుంటున్నాం. చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నాం. బెడ్ షీట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నాం. పరిసరాలు పరిశుభ్రంగా లేక పాములు వస్తున్నాయని డీఈవో ముందు’ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.