వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడలో ఆత్మీయ కలయిక లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్న ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది…రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. రాజశేఖర రెడ్డి వెళ్ళే విమానంలో నేను వెళ్ళల్సింది కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్పు కోసం ఆగానని… నేను బతికాను కాబట్టే ముఖ్యమంత్రి అయ్యానని అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ముప్పు వస్తే అది బిజెపి వల్లేనని పీవీ నరసింహారావు అనేవారన్నారు. నాకు ముఖ్యమంత్రి సీటు కావాలని ఎవరిని అడగలేదని… రాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఏ స్థాయిలో వుంటారో చెప్పలేమని… విభజన సమయంలో ప్రజలు నష్టపోతున్నారని ఆరోజు సిఎం పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. రాజీనామా చేస్తున్న సమయంలో కూడా సోనియాకు, రాహుల్ గాంధీకి దాదాపు 40 నిమిషాల పాటు వివరంగా చెప్పాను… వారు వినలేదని పేర్కొన్నారు. ఏపిని ఎవరు ఇచ్చారు…తెలంగాణను ఏపీలో కలిపింది ఎవరు ? రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత నేను రాజీనామా చేస్తానని చెప్పానన్నారు.