యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్‌యూఐ నేతలు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేడు జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జిల్లాలోని కీలక నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ సంచలన ట్వీట్ చేశారు. పోలీసుల బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి అన్నారు. ఎక్స్ వేదికగా హరీశ్ రావు స్పందిస్తూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడం, గృహ నిర్భంధం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.పోలీసుల అండ చూసుకుని,ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.