అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండాలో శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వడియా నవీన్ కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటూ చుట్టుపక్కల మామిడి తోటల్లో మొక్కలు అంటుగట్టే పనికి వెళ్తుంటాడు.
ఈ క్రమంలో అతడు కొన్ని అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరిగి.. అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురయ్యాడు.పని కోసమని చెప్పి 10 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన నవీన్ కుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. గురువారం నుంచి అతడి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు అంతటా వెతకడం మొదలుపెట్టగా.. అతడి వ్యవసాయ భూమిలోనే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కన్పించాడు.