రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, సమర్థవంతంగా వాటి అమలు కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు గందరగోళంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూరు గ్రామసభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా రెండు సీజన్లు ఇవ్వలేదని, ఎన్నికల్లో ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇప్పుడు 12వేలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. తన నియోజకవర్గంలో మాత్రం కేవలం 306 ఇళ్లకు మాత్రమే అనుమతి ఎందుకని ఇచ్చారని నిలదీశారు.అంటే.. ఒక్కో ఊరుకి 21 ఇళ్లే ఇస్తున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.900మందికి అర్హత ఉన్నదని చెప్పిన అధికారులు మాకు పై నుంచి 306 ఇండ్లకే అనుమతిచ్చారంటున్నారని, అలాగైతే గ్రామంలో ఎంపిక చేసే 21 మంది పేర్లను ఈ గ్రామసభలోనే అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.