భారత మహిళల అండర్-19 జట్టుకు ఎదురులేకుండా పోయింది. మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గ్రూపు దశను అజేయంగా ముగించింది. గురువారం చివరి గ్రూపు మ్యాచ్లో శ్రీలంకను ఓడించి హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 58/9 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయంలో తెలుగమ్మాయి గొంగడి త్రిష(49), షబ్నమ్ షకీల్(2/9) కీలక పాత్ర పోషించడం విశేషం.
ఇక ఈ విజయంతో భారత్ సూపర్-6 రౌండ్ కి అర్హత సాధించింది. ఆదివారం మలేసియాతో
తలపడనుంది భారత్. శ్రీలంకతో మ్యాచ్లో భారత్ బ్యాటుతో తడబడినప్పటికీ బంతితో రాణించడంతో విజయం కోసం పెద్దగా కష్టపడలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు గొంగడి త్రిష అండగా నిలిచింది. ఓపెనర్ గా వచ్చిన ఈ తెలంగాణ అమ్మాయి లంక బౌలర్లపై విరుచుకుపడింది. అయితే, మరో ఎండ్లో వికెట్లు పడటంతో త్రిష ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. 44 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి 49 పరుగులు చేసింది. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ భారత్ 118 పరుగులతో పోరాడే స్కోరు సాధించిందంటే త్రిషనే కారణం అని చెప్పవచ్చు.