విద్య, అభివృద్ధిలో నేటికీ అంతరాలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మానవ సంబంధాలు బలహీనపడుతున్నందున మానవ విలువలను, సంబంధాలను పటిష్టం చేసేందుకు ప్రతిఒక్కరూ విద్యను ప్రోత్సహించాలన్నారు.
బుధవారం విద్యాధన్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే వికాసం సాధ్యపడుతుందని దివంగత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చిందని.. 6-14 ఏళ్ల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను తీసుకొచ్చారని ఆమె గుర్తుచేశారు.విద్యను పంచుకుంటేనే జ్ఞానం పెరుగుతుందని, ఆ ఉద్దేశ్యంతో విద్యా ధన్ ఫౌండేషన్ పనిచేయడం అభినందనీయమని అన్నారు. పేదలకు విద్య అందించే విద్యాధన్ ఫౌండేషన్‌కు తమ ప్రభుత్వ సహకారం అన్నివేళలా ఉంటుందని మంత్రి స్పష్టంచేశారు.