కొత్త రేషన్ కార్డుల కోసం జనాలకు తిప్పలు తప్పడం లేదు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కనీసం మార్పులు, చేర్పులు, కొత్తగా పేర్లు యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు సాగడం లేదు.
మొన్నటివరకు ప్రజావాణి, గ్రామసభలు, ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించినా ఎవరికీ డిజిటల్ కార్డులు కూడా రాలేదు. కనీసం ఫైనల్ అయిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల కాలేదు. గ్రామసభల్లో అప్లై చేసుకోనివారికి మరో అవకాశం కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని..ఇంతకుముందు అప్లై చేసిన వారు చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల వద్ద జనాలు బారులు తీరినట్లు తెలుస్తోంది.