సాధారణంగా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లొచ్చే సరికి దొంగలు ఇల్లును గుల్ల చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే..? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడనే పెద్దల మాటకు ఇది కరెక్ట్ సూట్ అవుతుందేమో. ఓ అల్లుడు అత్తింటికే కన్నం వేశాడు. అత్త ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. ఆమె ఇంట్లో లేని సమయం చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. అందిన కాడికి దోచుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. నగరంలోని రోటరీనగర్ కు చెందిన సంతోష్ వాళ్ల అత్త ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. అదే అదునుగా భావించిన అల్లుడు సంతోష్ చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఉంచిన 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఊరి నుంచి తిరిగి వచ్చిన అత్తకు షాక్ తగిలింది. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు సంతోష్ ని అరెస్ట్ చేశారు.