పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రజలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగరాదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఖర్గే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక ఆదేశాలు కూడా విడుదలయ్యాయి. పహల్గామ్ దాడిని దేశ ఐక్యతపై జరిగిన దాడిగా పేర్కొన్న ఖర్గే, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
కర్ణాటక మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ “ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి చంపలేదు” అని వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ “ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు సంబంధం లేదని చెప్పడం వల్ల సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం సరికాదు” అన్న వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు పాకిస్థాన్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్నాయని ఆరోపించారు. శత్రు దేశాల ముందు దేశ గౌరవాన్ని దిగజార్చేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
సొంత పార్టీలో నేతల వ్యాఖ్యలను నియంత్రించడంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు విఫలమయ్యారని విమర్శించారు. ఉగ్రదాడి సమయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తుంటే, స్వదేశంలో కొన్ని రాజకీయ నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ నేతల జాతీయ ఐక్యతపై చేసే ప్రసంగాలు కేవలం మాటలకే పరిమితమా అని ప్రశ్నించారు.