తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించిన హామీలను ఇప్పుడు ఉద్యోగులు మాత్రమే కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు. “గద్దెనెక్కిన తర్వాత సమ్మెలు వద్దు, ఆందోళనలు చేయొద్దు అనడం ఎలా?” అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. “హామీలు ప్రకటించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? సాధ్యంకాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక పరిస్థితిని దాపురంగా చూపుతున్నారు. ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం,” అంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.
ఇక, ఉద్యోగుల సమ్మె అంశంపై సీఎం రేవంత్ స్పందిస్తూ, “ప్రతి నెల తొలి తారీఖున జీతాలు ఇస్తున్నాం. అయినా సమ్మె చేయడం సమంజసం కాదు. ప్రభుత్వం ఒక్క వ్యక్తి చేతిలో ఉండదు. అందరం కలిసే ప్రభుత్వం. మనం పాలకులు కాదని సేవకులమని గుర్తుంచుకోవాలి,” అని పేర్కొన్నారు. అలాగే, “ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వానికి సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమ్మెను మొదలుపెడుతున్నాయి. ఇది బాధ్యతాయుతంగా కాదు. సమస్య ఉంటే చర్చించుకోవాలే గానీ, నిరసనల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదు,” అని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ లక్ష్మణ్ స్పందిస్తూ, ప్రజల బాధలు తుంచేసి హామీలు ఇస్తే.. అధికారంలోకి వచ్చాక దానికి భిన్నంగా మాట్లాడటం దారుణమన్నారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పుదోవ పట్టించకూడదని హెచ్చరించారు.